14, జనవరి 2010, గురువారం

చిన్ననాటి సంక్రాంతి

పెళ్ళిపుస్తకం లో గుమ్మడి అన్నట్లు, నేనూఊ….....చిన్నప్పుడు అందరిలాగే పండగలంటే చాలా ఇష్టపడేవాణ్ణి. కారణాలు మామూలే. ఎంచక్కా బడి ఎగ్గొట్టి ఇంట్లోనే ఉండొచ్చనీ, టి.వి. లో పండగ రోజు వచ్చే మంచి మంచి ప్రోగ్రాములు, కొత్త సినిమాలు చూడొచ్చనీ, ఇంకా సాయంత్రం మా నాన్న తో కలిసి ఫస్ట్ షో సినిమాకి వెళ్ళొచ్చనీ!!! నాకు అన్ని పండగల్లోకీ బాగా ఇష్టమైనది దసరా. ఎందుకంటే 13 రోజులు సెలవలు ఇస్తారు మరి. అయిదు రోజులు ఇస్తారు కాబట్టి, సంక్రాంతి కూడా 'కుంచెం' ఇష్టమే. చిన్నప్పుడు సంక్రాంతి ప్రత్యేకతలు ఏంటీ అని అడిగితే (మీరు అడక్కపొయినా.. నేనే చెప్తాను), జనవరి నెలలో, పడుతుందా లేదా అన్నట్లుగా పొద్దున్నే పడే మంచు, ఊళ్ళో అందరూ వేసే రథం ముగ్గులు, అందులో అద్దే రంగులు, గొబ్బెమ్మలు, ఇంటికొచ్చే చుట్టాలు, హరిదాసులు, గంగిరెద్దు మేళం, ఆ దరిదాపుల్లోనే ఇచ్చే half-yearly exams resultsu.

సంక్రాంతి రోజు పొద్దున అయిదు గంటలకల్లా నిద్ర లేచే వాణ్ణి. అంతకు ముందే అమ్మా వాళ్ళు నిద్ర లేచి వంట పనిలో ఉండేవాళ్ళు. నేను లేచేసరికి గారెల పిండి రుబ్బే కార్యక్రమం లో ఉండే వాళ్ళు. అప్పుడే తెల తెలవారుతున్నట్లు, గోదావరి సినిమాలో heroine introduction sceneలో లా ఉండేది lighting. ఆ site నాకు చాలా చాలా ఇష్టం. నేను లేవగానే వినబడే మొదటి dialogue "ఏంటమ్మా అప్పుడే నిద్ర లేచావ్. ఇంకాసేపు పడుకోపోయావా??"..మా అమ్మ. అందరి ఇళ్ళల్లో పొద్దునే లేవమని తిడతారు(ట). కానీ మా ఇంట్లో మాత్రం నేను ఎన్నింటికి నిద్ర లేచినా ఇంకాసేపు పడుకోమనే అంటారు. అదొక అదృష్టం. తర్వాత మొహం కడుక్కోటం ఇత్యాది కార్యక్రమాలయ్యాక, చిన్నప్పటి సైన్సు పుస్తకం లో చదువుకున్న భాషలో చెప్పాలంటే- కాలకృత్యాలన్నీ పూర్తి అయ్యాక, ఇంక స్నానాల ప్రహసనం-మా ఇంట్లో చుట్టాలు అందరూ ఉన్నప్పుడు అది పెద్ద ప్రహసనమే మరి. పదిసార్లు చెప్పించుకుంటే గానీ తెమిలేవాళ్లు కాదు మా అక్కా&Co (అలంకారం అంటే అంత ఆసక్తి చూపించే అమ్మాయిలకి స్నానం అంటే అంత బద్దకం ఏంటో నాకు ఇప్పటికీ అర్ధం కాదు). నేను అలా కాదులేండి. కాంతు (నేనే) మంచి బాలుడు. అందరికన్నా ముందు నేనే వెళ్లేవాణ్ని. తయారవగానే గారెల మీదకి చట్నీ సహకారంతో దండయాత్ర. అతి ముఖ్యమైన ఆ కార్యక్రమం పూర్తవగానే, ఒకసారి బయటికి వెళ్లి రాత్రి మా అక్క వాళ్లు వేసిన ముగ్గు చూసేవాణ్ని. అదెంటో రాత్రి ముగ్గు వేసినంతసేపు పక్కనే ఉన్నా, పొద్దున్నే కొత్తగా కనిపించేది.

సంక్రాంతి ముందు రోజు రాత్రి మా అక్క, మా ఇంటి పక్క ఒక అమ్మాయి కూర్చుని ముగ్గు వేసే వాళ్లు. ఆ అమ్మాయి రోజూ మా ఇంటికి వచ్చేది. నాకు అప్పట్లో చాలా మంచి friend. ఆ.. ఆగండి ఆగండి. అక్కడే ఆగండి. మీరేం ఆలోచిస్తున్నారో నాకు అర్ధం అయింది. ఎంతైనా మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఆ అమ్మాయి మా అక్క classmate. నాకు అక్క అవుతుంది (చుట్టరికంలో కూడా). మా అక్కా తనూ ముగ్గులు వేసినంత సేపూ నేను పక్కనే ఉండేవాణ్ని. అన్నట్లు మర్చిపోయా..మా ముగ్గుకి రంగులు నేనే తెచ్చేవాణ్ని. అయితే మా అమ్మ ఎన్ని రంగులు తెమ్మంటే అందులో సరిగ్గా రెండు తగ్గించి తెచ్చేవాణ్ని. మా అమ్మ ఏంటి తక్కువ తెచ్చావు..అని అడిగితే అర్జునుడికి భగవద్గీత చెబుతున్న శ్రీ కృష్నుడి లెవెల్లో ఫోజ్ పెట్టి- ఇంట్లో పసుపు, కుంకం ఉన్నాయి కదా. అవీ రంగులే కదా..ఎందుకు డబ్బులు దండగ.. అందుకే రెండు తక్కువ తెచ్చా అని ముగ్గోపదేశం చేసేవాణ్ని(పొదుపు!!???@^%$@$%@%#).

అన్నట్లు నేనూ ముగ్గు వెయ్యటానికి ప్రయత్నించానండోయ్ చాలా సార్లు. నాకు ముగ్గు వెయ్యటం, medicine చేసినవాడు జావా ప్రోగ్రాం రాసినంత కష్టంగా, తెలుగు మాష్టారు కాల్ సెంటర్లో జాబ్ చేసినంత అయోమయంగా ఉండేది. తీరా ఎలాగో కష్టపడి ఒక చిన్న ముగ్గు వేస్తే అది, software engineer ఇంటి ప్లాను గీసినంత అందంగా వచ్చేది. ఈ మధ్యకాలంలో అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదులేండి. మీ కోసం కష్టపడి నేను కంప్యూటర్లో వేసిన ఈ చిన్న ముగ్గు.



చిన్నప్పుడు సంక్రాంతి పండగకి ప్రధాన సందడి అంటే హరిదాసులు, గందిరెద్దు మేళమే. హరిదాసు రాగానే మా అమ్మ నన్నే వెళ్లి బియ్యం పోసి రమ్మనేది. ఎందుకంటే సర్వకాల సర్వావస్థలయందూ ఖాళీగా ఉండేది నేనే మరి. నాకు వాళ్లకి చాలా ఎక్కువ బియ్యం పోయాలని ఉండేది (ఎంతైనా జాలి గుండె కదా మలీ!!). కానీ నా చేతులేమూ చాలా చిన్నగా ఉండేవి. అందువల్ల దోసిట్లో కదిలితే కింద పడిపొతాయన్నంత నిండా పోసుకుని, ఇప్పుడు టి.వి.లో వస్తున్న ఏదో కాఫీ యాడ్ లో హీరోయిన్లా దోసిట్లో బియ్యన్నే చూస్తూ, అడుగులో అడుగు వేస్కుంటూ వెళ్లి హరిదాసు తల మీదున్న గిన్నెలో (గిన్నేనా???) పోసి వచ్చేవాణ్ని.

ఇప్పుడు అవన్నీ తల్చుకుంటే భలే నవ్వు వస్తుంది. కానీ దిగులుగా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు జీ(వి)తం కోసం పెట్టే పరుగులో ఎవరికి వారే యమునా తీరే..అక్కకి పెళ్లైపోయింది. నేను ముందు చదువుకి, తర్వాత జాబుకి ఇంటినుంచి వచ్చేశాను. సో, పండగా లేదు, సందడీ లేదు. ముగ్గూ, అది వేసేవాళ్లూ ఎవరూ లేరు. ఇప్పుడు కాలక్రమేణా హరిదాసులు, గంగిరెద్దువాళ్లు కూడా రావటం మానేశారట. నాకు ఒకోసారి దేవుడి మీద (ఉంటే!!!) చాలా కోపం వస్తుంది. మనకి ఇష్టమైన అనుభవాల్ని మనకి మళ్లీ తిరిగి ఇవ్వలేనప్పుడు, వాటికి సంబంధించిన ఙ్నాపకాలని మాత్రం ఎందుకు మిగల్చాలి అని. కానీ వెంటనే మళ్లీ దేవుడు ఇలా చెప్తాడేమో అనిపిస్తుంది "పిచ్చివాడా!!! ఆ ఆనందాలు పూర్తిగా మళ్లీ తిరిగి రావు కాబట్టి, అవి నెమరు వేసుకుని అందులో కొంతైనా మళ్లీ పొందటానికి"..

2 comments:

శిశిర చెప్పారు...

మీ శైలి బాగుంది. చాలా బాగా రాశారు.

శ్రీ..... చెప్పారు...

థాంక్యూ శిశిర గారూ!!!

Shout